PMAY-G 2.0 కింద తెలంగాణ రాష్ట్రానికి 11,56,915 ఇళ్లను ఒకే విడతలో కేటాయించాలని గృహ నిర్మాణ మరియు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనికి సంబంధించి ఆయన ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G 2.0) కింద రాష్ట్రానికి 11,56,915 ఇళ్లను ఒకే విడతలో కేటాయించాలని తెలంగాణ గృహ నిర్మాణ మరియు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన న్యూఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు వినతిపత్రం సమర్పించి, రాష్ట్ర పర్యటన చేయవలసిందిగా ఆహ్వానించారు.

'ఆవాస్ ప్లస్-2024' అప్లికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పారదర్శకమైన ఇంటింటి సర్వే నిర్వహించబడిందని మంత్రి తెలిపారు. ఈ సర్వేలో 11.56 లక్షల కంటే ఎక్కువ గ్రామీణ పేద కుటుంబాలు గృహ సహాయానికి అర్హత సాధించినట్లు గుర్తించారు. అనర్హులైన లబ్ధిదారులను తొలగించే ప్రక్రియ ఏడాది క్రితమే పూర్తయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం లక్ష్యాలను ప్రకటించడంలో ఆలస్యం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.