విశాఖపట్నంలో ఫైవ్ స్టార్ లగ్జరీ ఎకో-రిసార్ట్ నిర్మాణానికి మరియు నిర్వహణకు ఏవీఎన్‌జీ డెవలపర్స్ ఎల్ఎల్‌పీ, హాస్పిటాలిటీ సంస్థ అట్మాస్పియర్ కోర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. స్థానిక డెవలపర్ చేసిన రూ.180 కోట్ల పెట్టుబడిని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ‘నిజంగా గర్వించదగ్గ క్షణం’ అని అభివర్ణించారు.
తూర్పు కనుమల సుందరమైన ప్రకృతి ఒడిలో విశాఖపట్నం నగరం కనిపించేలా 'అట్మాస్పియర్ హిల్లోరా ఎకో రిసార్ట్ విశాఖపట్నం' పేరుతో ఫైవ్ స్టార్ లగ్జరీ ఎకో-రిసార్ట్‌ను నిర్మించేందుకు ఏవీఎన్‌జీ డెవలపర్స్, అట్మాస్పియర్ కోర్ మధ్య హోటల్ మేనేజ్‌మెంట్ ఒప్పందం కుదిరింది. రాష్ట్ర పర్యాటక విధానం వల్లే ఈ పెట్టుబడి సాధ్యమైందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ రిసార్ట్ ఉన్నత స్థాయి వివాహాలు, కార్పొరేట్ ఈవెంట్లకు ప్రధాన వేదికగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ రిసార్ట్ ఎస్. కోట సమీపంలో ప్రకృతి మరియు సరస్సుల మధ్య నిర్మించనున్నారు. ఇది త్వరలో ప్రారంభం కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సుమారు గంట ప్రయాణ దూరంలో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ రెండు దశల్లో అందుబాటులోకి రానుంది. మొదటి దశలో 2029 మొదటి త్రైమాసికంలో 100 గదులు, రెండో దశలో మరో 80 గదులు అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానికంగా వందలాది మందికి ఉపాధి లభిస్తుందని స్థానిక ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు.