బెంగాల్‌లోని గోబర్‌డంగా హిందూ కళాశాల లెక్చరర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో విద్యార్థులు ఆయనను కళాశాల ప్రాంగణంలో తిప్పారు. ఈ క్రమంలో విద్యార్థులు ఆయనపై గుడ్లు విసిరి, షూల మాల వేసి అవమానించారు.
గోబర్‌డంగా హిందూ కళాశాల భౌగోళిక శాస్త్ర లెక్చరర్ సందీప్ దత్తాపై ఒక విద్యార్థిని లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. సదరు విద్యార్థిని ఫోన్ ద్వారా వేధించడం, తన ఇంట్లో ఉచితంగా ట్యూషన్ చెప్పి 'మంచి సంబంధం' పెంచుకుందామనే ఆఫర్ ఇవ్వడం వంటివి చేసినట్లు ఆమె ఫిర్యాదు చేశారు. ఆమె ఈ ప్రతిపాదనలను తిరస్కరించడంతో, పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించినట్లు ఆమె పేర్కొన్నారు.
ఈ విషయం తెలిసిన ఇతర విద్యార్థులు ఆగ్రహంతో లెక్చరర్‌ను చుట్టుముట్టి, కళాశాల ప్రాంగణంలో ప్రదర్శన చేస్తూ, ఆయనపై గుడ్లు విసిరి, షూల మాల వేసి అవమానించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడైన సందీప్ దత్తాను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు.