బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లో జరిగిన హిట్ అండ్ రన్ ప్రమాదంలో 26 ఏళ్ల ఐటీ నిపుణుడు అమర్త్యా కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. ఒక కారు బైక్ టాక్సీని ఢీకొట్టి పరారవడంతో అతను ప్రస్తుతం ఐసీయూలో కోమాలో ఉన్నాడు.
బెంగళూరు వైట్‌ఫీల్డ్ లోని ఐటిపిఎల్ మెయిన్ రోడ్డుపై జూలై 13 రాత్రి జరిగిన ప్రమాదంలో 26 ఏళ్ల ఐటీ ఉద్యోగి అమర్‌త్యా కుమార్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. రాత్రి సుమారు 11:45 గంటల ప్రాంతంలో ఫార్ములా వన్ జంక్షన్ వద్ద ఒక కారు బైక్ టాక్సీని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అమర్‌త్యా తలకు తీవ్ర గాయమైంది, ప్రస్తుతం అతను ఐసీయూలో చికిత్స పొందుతూ కోమాలో ఉన్నాడు.
అమర్‌త్యా సేగెహల్లి నుండి హూడికి వెళ్లడానికి బైక్ టాక్సీ బుక్ చేసుకున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ అక్కడి నుండి పారిపోయాడు. బైక్ నడిపిన ప్రకాష్‌కు స్వల్ప గాయాలైంది, కానీ అమర్‌త్యా పరిస్థితి విషమంగా మారింది.
ఈ ఘటనపై అమర్‌త్యా సోదరి సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బైక్ టాక్సీ సంస్థ తక్షణమే ఆర్థిక మరియు వైద్య సహాయం అందించాలని డిమాండ్ చేశారు. బైక్ నడిపిన వ్యక్తికి సరైన లైసెన్స్ ఉందో లేదో కూడా విచారించాలని కోరారు. వైట్‌ఫీల్డ్ ట్రాఫిక్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, పరారైన కారు డ్రైవర్‌ను వేటలో ఉన్నారు.