ఫరీదాబాద్‌లో వివాహం చేసుకోవడానికి నిరాకరించినందుకు ఒక మహిళ తన ప్రేమికుడిని అత్యంత క్రూరంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలైన అనితను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఫరీదాబాద్‌లోని అనంగ్ పూర్ గ్రామంలో జరిగిన ఈ ఘోర ఘటనలో, 33 ఏళ్ల అనిత అనే మహిళ తన ప్రేమికుడు సదఖాత్‌ను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పెళ్లి చేసుకోవాలని అనిత ఒత్తిడి చేస్తున్నప్పటికీ, సదఖాత్ కాలయాపన చేస్తున్నాడని, దీంతో ఆమె కోపంతో అతడిని చంపేసిందని పోలీసులు తెలిపారు. జూలై 25న సదఖాత్‌కు మద్యం అందించి, అతను నిద్రపోతున్న సమయంలో కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు విచారణలో తేలింది.

సదఖాత్ ఒక పెయింటర్‌గా పనిచేసేవాడు. అతని సోదరుడు నాజకత్ అలీ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి, శుక్రవారం రాత్రి అనితను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితురాలిని కోర్టులో హాజరుపరిచి, పోలీసు రిమాండ్‌కు పంపారు.