కేరళలోని త్రిస్సూర్ పాఠశాల యజమాని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరుకాని విద్యార్థులను 'పాకిస్తాన్ వెళ్ళిపోండి' అని అనడం పెద్ద వివాదానికి దారితీసింది. విద్యార్థులను 'దేశద్రోహులు'గా ముద్ర వేయడాన్ని తల్లిదండ్రులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
కేరళలోని త్రిస్సూర్ మాలా ప్రాంతానికి చెందిన డాక్టర్ రాజు డేవిస్ ఇంటర్నేషనల్ స్కూల్ యజమాని రాజు డేవిస్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనని విద్యార్థుల కోసం ఒక వాట్సాప్ వాయిస్ నోట్‌లో, 'మీరు స్వాతంత్ర్య దినోత్సవాన్ని మిస్ అయితే, పాకిస్తాన్‌కు వెళ్ళిపోండి' అని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది.
పాఠశాల నిర్వహించిన వేడుకలకు వివిధ కారణాల వల్ల హాజరుకాని విద్యార్థులను 'దేశద్రోహులు'గా చిత్రీకరించడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పాఠశాల కార్యక్రమానికి రాలేదని పిల్లలను ఇలా విమర్శించడం ఏమాత్రం సమంజసం కాదని వారు ప్రశ్నిస్తున్నారు.
ఈ వివాదంపై స్పందించిన రాజు డేవిస్, పాకిస్తాన్ భారతదేశానికి శత్రు దేశం అని, స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఇంట్లో ఉండటం అంగీకరించలేనిదని సమర్థించుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో, ఎస్ఎఫ్ఐ (SFI) మాలా ప్రాంత కమిటీ పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసన యాత్రను నిర్వహించింది.