ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక యువకుడు తనను కరిచిన పామును మెడకు చుట్టుకుని 14 కిలోమీటర్ల దూరం బైక్‌పై ప్రయాణించి ఆసుపత్రికి చేరుకున్నాడు. అతను స్నేక్ క్యాచర్‌గా పనిచేస్తున్నాడు.

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లా పఖాంజూర్ గ్రామానికి చెందిన దేవ్‌జిత్ సర్కార్ గత ఎనిమిదేళ్లుగా స్నేక్ క్యాచర్‌గా పనిచేస్తున్నాడు. నివాస ప్రాంతాల్లోకి వచ్చే పాములను పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించడం అతని పని. ఈ క్రమంలో ఒక పామును పట్టుకోవడానికి ప్రయత్నించగా, అది అతన్ని కరిచింది.

ఆ పాము విషపూరితమా కాదా అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో, ఆ పామును మెడకు చుట్టుకుని బైక్‌పై 14 కిలోమీటర్లు ప్రయాణించి ఆసుపత్రికి చేరుకున్నాడు. వైద్యులు పరీక్షించిన తర్వాత ఆ పాము విషపూరితం కాదని తేలింది. పామును మెడకు చుట్టుకుని రావడం చాలా ప్రమాదకరమని, అది విషపూరితమైనది అయితే ప్రాణాపాయం సంభవించేదని డాక్టర్ సంజీత్ వైష్ణవ్ తెలిపారు. దేవ్‌జిత్ ప్రస్తుతం క్షేమంగా ఉన్నాడు.