బీజేపీ నేత యోగేష్ గౌడ హత్య కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న మాజీ మంత్రి వినయ్ కులకర్ణికి కర్ణాటక హైకోర్టు భారీ ఉపశమనం కలిగించింది. ఆయన శిక్షపై స్టే విధిస్తూ అంతరిమ బెయిల్ మంజూరు చేసింది.

బీజేపీ నాయకుడు యోగేష్ గౌడ హత్య కేసులో యావజ్జీవ శిక్షకు గురైన కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి వినయ్ కులకర్ణికి కర్ణాటక హైకోర్టులో భారీ ఉపశమనం లభించింది. ప్రజాప్రతినిధుల కోర్టు విధించిన శిక్షను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, శిక్షను నిలిపివేస్తూ (స్టే) అంతరిమ బెయిల్ మంజూరు చేసింది.

జస్టిస్ బసవరాజ్, జస్టిస్ మహమ్మద్ నవాజ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ కీలక ఆదేశాలను జారీ చేసింది. వినయ్ కులకర్ణితో పాటు మరో నలుగురికి రూ. 5 లక్షల బాండ్, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. అయితే, వీరెవరూ దేశం విడిచి వెళ్లకూడదనే కఠినమైన షరతును కోర్టు విధించింది. కులకర్ణి తరఫున సీనియర్ న్యాయవాది సి.వి. నాగేష్ వాదనలు వినిపించారు.