పొగాకు ధరల పతనం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం రూ. 1000 కోట్లు కేటాయించి సొసైటీల ద్వారా నేరుగా కొనుగోలు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి లేఖ రాశారు.

పొగాకు రైతులకు ఎదురవుతున్న తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు. రైతులు గత 100 రోజులుగా తమ సమస్యలపై పోరాడుతున్నారని, ప్రస్తుతం ప్రతిపాదించిన ధరలు మార్కెట్ ధరల కంటే తక్కువగా ఉండి రైతులను మరింత దిగులుకు గురిచేస్తున్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు.

ఈ ఏడాది 240 మిలియన్ కిలోల ఉత్పత్తి అయినప్పటికీ, కంపెనీలు కేవలం 14 శాతం మాత్రమే కొనుగోలు చేశాయని శ్రీనివాసరావు తెలిపారు. మార్కెట్లో పోటీ పెంచడానికి ప్రభుత్వం రూ. 1000 కోట్లు కేటాయించి సొసైటీల ద్వారా కొనుగోళ్లు ప్రారంభించాలని ఆయన సూచించారు. దీనివల్ల ఇతర కంపెనీలు కూడా ధరలను పెంచి కొనుగోలు చేసేలా ఒత్తిడి పెరుగుతుందని ఆయన వివరించారు.