కొన్ని రకాల సహజీవన (లైవ్-ఇన్) సంబంధాలలో ఉన్న మహిళలు కూడా సెక్షన్ 498A కింద రక్షణ పొందవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే, ఆ సంబంధం "వివాహం వంటి" స్వభావాన్ని కలిగి ఉండటంతో పాటు, పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా ఉండాలి.
డాక్టర్ లోకేష్ బి.హెచ్ వర్సెస్ కర్ణాటక ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ నోంగ్మీకాపమ్ కోటేశ్వర్ సింగ్‌లతో కూడిన బెంచ్ కీలక తీర్పు వెలువరించింది. గృహహింసకు వ్యతిరేకంగా రక్షణ కల్పించే సెక్షన్ 498A (ప్రస్తుత భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 85) కేవలం చట్టబద్ధంగా వివాహమైన మహిళలకు మాత్రమే పరిమితం కాదని కోర్టు స్పష్టం చేసింది.
అయితే, ప్రతి సహజీవన సంబంధానికి ఇది వర్తించదని కోర్టు స్పష్టం చేసింది. వివాహం చేసుకునే ఉద్దేశంతో ఉంటూ, "వివాహం వంటి స్వభావం" కలిగిన సంబంధాలకు మాత్రమే ఈ రక్షణ లభిస్తుంది. ఈ చట్టం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు, తమ సంబంధం వివాహం వంటిదని నిరూపించాల్సిన ప్రాథమిక బాధ్యత సదరు మహిళపైనే ఉంటుందని కోర్టు తెలిపింది. అలాగే అరెస్టులకు సంబంధించిన రక్షణ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది.