E-20 ఇథనాల్ మిశ్రిత ఇంధన విధానానికి తాము సంబంధం లేదని కేంద్ర మంత్రి నితిన్ గాడ్కరి ప్రకటించడం కొత్త చర్చకు దారితీసింది. ఇంధనం వల్ల వాహనాల మైలేజ్ తగ్గుతున్నాయని ప్రజలు ఫిర్యాదు చేస్తున్న తరుణంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గాడ్కరి E-20 ఇథనాల్ విధానం నుండి తనను తాను వేరు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బాంబే హైకోర్టులో పిటిషన్ వేసిన ఆయన, ఈ పథకానికి తనకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. గతంలో ఇథనాల్ వినియోగం వల్ల రైతులకు లాభం కలుగుతుందని, కాలుష్యం తగ్గుతుందని గొప్పగా ప్రచారం చేసిన గాడ్కరి, ఇప్పుడు సమస్యలు తలెత్తడంతో బాధ్యత నుండి తప్పుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి.
E-20 పెట్రోల్ వాడటం వల్ల వాహనాల మైలేజ్ పడిపోవడం, ఇంజన్లకు నష్టం వాటిల్లడం వంటి సమస్యలపై ప్రజలు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, డీప్‌ఫేక్ వీడియోల వల్ల తన ప్రతిష్ట దెబ్బతింటోందని ఆయన కోర్టును ఆశ్రయించారు. అయితే, ఒక మంత్రిగా విధానపరమైన నిర్ణయాల పట్ల సామూహిక బాధ్యత వహించాల్సి ఉంటుందని విమర్శకులు వాదిస్తున్నారు.