కేంద్ర ప్రభుత్వ E20 పెట్రోల్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజరివాల్ పోరాటాన్ని ముమ్మరం చేశారు. ఆగస్టు 4న 100 మందితో కలిసి ప్రధాని మోదీ నివాసానికి పాదయాత్ర చేస్తామని ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న E20 పెట్రోల్ విధానానికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజరివాల్ పోరాటాన్ని తీవ్రతరం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ టౌన్ హాల్ సమావేశంలో మాట్లాడుతూ, ఆగస్టు 4వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు 100 మంది ధైర్యవంతలతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసం వైపు పాదయాత్ర చేస్తామని ఆయన ప్రకటించారు.

ఈ పాదయాత్ర సందర్భంగా, ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆన్‌లైన్‌లో సంతకం చేసిన 2 లక్షల మందికి పైగా ప్రజల పిటిషన్‌ను ఆయన వ్యక్తిగతంగా ప్రధానికి అందజేయనున్నారు. ఈ పోరాటం కోసం పెద్ద గుంపు అవసరం లేదని, లాఠీచార్జ్‌కు భయపడని 100 మందిని మాత్రమే వెంట తీసుకెళ్తానని కేజరివాల్ తేల్చి చెప్పారు. ప్రజలు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరుతూ ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) బయోను కూడా మార్చుకున్నారు.

పెట్రోల్ పంప్‌ల వద్ద ప్రజలు 100% స్వచ్ఛమైన పెట్రోల్‌ను లేదా E20 మిశ్రమ పెట్రోల్‌ను ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలని ఆయన ప్రధాన డిమాండ్‌గా పేర్కొన్నారు. అలాగే, స్వచ్ఛమైన పెట్రోల్ ధర E20 కంటే తక్కువగా ఉండాలని మరియు పెట్రోల్ ధర లీటరుకు 84 రూపాయల కంటే తక్కువగా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.