తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ స్నేహితుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి విడుదల చేశారు. ఈ అరెస్ట్‌ను తప్పుబడుతూ కన్నడ నటుడు, సామాజిక కార్యకర్త చేతన్ అహింస తీవ్రంగా స్పందించారు. ఇది ప్రభుత్వ యంత్రాంగం దుర్వినియోగమేనని ఆయన విమర్శించారు.

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్, ఒక ప్రముఖ తమిళ నటుడి మధ్య ఉన్న స్నేహంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై డీఎంకే యువనేత ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు అరెస్టు చేసి, అనంతరం స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. ఈ పరిణామం తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది.

ఈ అరెస్టుపై కన్నడ నటుడు, సామాజిక కార్యకర్త చేతన్ అహింస తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి విజయ్ ప్రజాస్వామ్య విలువలను విస్మరిస్తున్నారని విమర్శించారు. "దోమను చంపడానికి కత్తిని ఉపయోగించడమా? తమిళనాడు ఒక పోలీస్ రాజ్యంగా మారుతోంది" అంటూ ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యర్థులను అణచివేయడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకోవడం సరికాదని హితవు పలికారు.

క‌ర్ణాట‌క నుండి కావేరి నీటిని సాధించడంలో తమిళనాడు ప్రభుత్వం విఫలమైందని ఉదయనిధి విమర్శిస్తున్న క్రమంలో ఈ వివాదం చోటుచేసుకుంది. యేల్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అయిన చేతన్ అహింస, సామాజిక సమస్యలపై నిరంతరం గళం విప్పే వ్యక్తిగా గుర్తింపు పొందారు.