ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక దేవాలయంలో ప్రతి సంవత్సరం ₹18 కోట్ల కానుకల సొమ్ము దుర్వినియోగం అవుతోందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది.
ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక దేవాలయంలో కానుకల సేకరణలో భారీ ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించాయి. ఏటా సుమారు ₹18 కోట్లు దొంగతనమవుతున్నాయని ఎంఎన్ఎస్ నాయకుడు రాజ్ థాక్రే ఆరోపించారు. ఈ నేపథ్యంలో, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఈ అంశంపై లోతైన విచారణ జరిపించాలని ఆదేశించారు.
దేవాలయ ట్రస్ట్ ప్రతినిధులు ఈ విషయాన్ని అంగీకరిస్తూ, కానుకల సేకరణలో లోపాలు ఉన్నాయని వెల్లడించారు. దీనిపై అవినీతి నిరోధక శాఖ మరియు రాష్ట్ర న్యాయ శాఖ విచారణ చేపట్టాలని కోరారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు తేలిన కొందరు ఆలయ సిబ్బందిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రస్తుత ట్రస్ట్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కానుకల సేకరణలో 35 శాతం పెరుగుదల వచ్చిందని, గతంలో జరిగిన అవకతవకలను గుర్తించడానికి త్రైమాసిక ఆడిట్‌లను చేపడుతున్నామని ట్రస్ట్ చైర్మన్ సదా సర్వణకర్ తెలిపారు. సిసిటివి ఫుటేజీల ద్వారా ఒక ముఠా తరహాలో సిబ్బంది డబ్బును దొంగిలిస్తున్నట్లు గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు.