తిరుపతిలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఆనం రామనారాయణారెడ్డి, జెండా ఆవిష్కరణ అనంతరం ప్రసంగిస్తుండగా అస్వస్థతకు గురయ్యారు.

తిరుపతి పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకలకు రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగిస్తున్న సమయంలో అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పక్కకు వాలిపోయారు.

వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మంత్రి కింద పడకుండా పట్టుకున్నారు. సకాలంలో స్పందించిన వైద్యులు మంత్రికి ప్రాథమిక చికిత్స అందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కొద్దిసేపటి తర్వాత మంత్రి ఆనం తిరిగి స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు.