2026 కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల టీమ్ జిమ్నాస్టిక్స్ ఫైనల్‌లో ఇంగ్లాండ్ జిమ్నాస్ట్ గాబ్రియేల్ లాంగ్టన్ హై బార్ నుండి కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

2026 కామన్వెల్త్ గేమ్స్‌లో గ్లాస్గోలో పురుషుల టీమ్ జిమ్నాస్టిక్స్ ఫైనల్ సందర్భంగా ఒక విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. 19 ఏళ్ల ఇంగ్లీష్ జిమ్నాస్ట్ గాబ్రియేల్ లాంగ్టన్ హై బార్‌పై తన రూటీన్ చేస్తున్న సమయంలో చేయి జారి నేరుగా తలకిందులుగా నేలపై పడిపోయారు. ఈ ప్రమాదం ఎంత భయంకరంగా ఉందంటే, స్టేడియం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది మరియు పోటీని కొన్ని నిమిషాల పాటు నిలిపివేయాల్సి వచ్చింది.

వైద్య బృందం వెంటనే రంగంలోకి దిగి, లాంగ్టన్ మెడ మరియు తల కదలకుండా ప్రత్యేక సపోర్ట్ ఇచ్చి, స్ట్రెచర్ సహాయంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఇంగ్లాండ్ జట్టు స్వర్ణ పతకం కోసం పోరాడుతోంది. చివరికి కెనడా గోల్డ్ మెడల్ సాధించగా, ఇంగ్లాండ్ సిల్వర్ మరియు ఆస్ట్రేలియా బ్రాంజ్ మెడల్స్‌తో సరిపెట్టుకున్నాయి.

అయితే, గాబ్రియేల్ లాంగ్టన్ పరిస్థితిపై శుభవార్త అందుతోంది. ఆసుపత్రిలో పరీక్షల అనంతరం అతనికి ఎటువంటి తీవ్రమైన గాయాలు లేవని వైద్యులు ధృవీకరించారు. అతను పూర్తిగా స్పృహలో ఉన్నాడని, ప్రస్తుతం వైద్య నిపుణుల పర్యవేక్షణలో టీమ్ హోటల్‌లో చికిత్స పొందుతున్నాడని బ్రిటిష్ జిమ్నాస్టిక్స్ సంస్థ ప్రకటించింది.