భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అతని బ్యాటింగ్ శైలిని దిగ్గజ ఆటగాడు సర్ డొనాల్డ్ బ్రాడ్‌మాన్‌తో పోల్చారు మాజీ క్రికెటర్ రోబిన్ ఉతప్ప.

భారత క్రికెట్ అభిమానుల మధ్య ప్రస్తుతం యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ పేరు మారుమోగుతోంది. జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లో వైభవ్ తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టించి, జట్టు తరపున అత్యధికంగా 151 పరుగులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అతని ఈ అద్భుత ప్రదర్శన క్రికెట్ దిగ్గజాల దృష్టిని ఆకర్షించింది.

రెండుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన రోబిన్ ఉతప్ప, వైభవ్ బ్యాటింగ్ టెక్నిక్‌ను సర్ డొనాల్డ్ బ్రాడ్‌మాన్‌తో పోల్చారు. బ్రాడ్‌మాన్ లాగే వైభవ్ కూడా ఒక ప్రత్యేకమైన శైలిని కలిగి ఉన్నాడని, అతను తన ప్రస్తుత స్ట్రైక్ రేట్‌తో పాటు 40 కంటే ఎక్కువ సగటును కొనసాగించగలిగితే ఆధునిక క్రికెట్‌లో గొప్ప ఆటగాడిగా ఎదుగుతాడని ఉతప్ప పేర్కొన్నారు.