శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత క్రికెట్ జట్టు షెడ్యూల్‌లో చివరి నిమిషంలో కీలక మార్పులు జరిగాయి. గతంలో నాలుగు రోజులుగా నిర్ణయించిన ప్రాక్టీస్ మ్యాచ్‌ను ఇప్పుడు మూడు రోజులకు కుదించారు. అలాగే, గాయపడిన యువ బ్యాటర్ సాయి సుదర్శన్ ఫిట్‌నెస్‌పై సానుకూల అప్‌డేట్ వచ్చింది.
శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత యువ జట్టు ఆగస్టు 4న కొలంబోకు పయనం కానుంది. శ్రీలంక స్థానిక జట్టుతో ఆగస్టు 7 నుంచి ప్రారంభం కానున్న నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ను మూడు రోజులకు కుదించారు. కొలంబోలోని ఎన్‌సీసీ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. టెస్ట్ సిరీస్‌కు ముందు లంక స్పిన్ పిచ్‌లపై భారత బ్యాటర్లకు తమ నైపుణ్యాలను పరీక్షించుకోవడానికి లభించే ఏకైక అవకాశం ఇదే కావడం గమనార్హం.
భారత్, శ్రీలంక మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఆగస్టు 15 నుండి 19 వరకు గాలేలో జరగనుంది. రెండో టెస్ట్ ఆగస్టు 23 నుండి 27 వరకు కొలంబోలో జరుగుతుంది. ఈ టెస్ట్ సిరీస్ ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 సైకిల్‌లో భాగం కావడం వల్ల రెండు జట్లకు ప్రతి పాయింట్ ఎంతో కీలకం కానుంది.
మరోవైపు, బొటనవేలు గాయంతో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో పునరావాసం పొందుతున్న ఎడమచేతి వాటం బ్యాటర్ సాయి సుదర్శన్ ఫిట్‌నెస్‌పై శుభవార్త అందింది. సుదర్శన్ తిరిగి బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడని, లంక పర్యటనకు వెళ్లే సమయానికి అతను పూర్తిగా ఫిట్ అవుతాడని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశాభావం వ్యక్తం చేసింది.