పంజాబ్ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సీనియర్ వన్డే టోర్నమెంట్‌లో అభిషేక్ శర్మ తరణ్ తారన్‌పై కేవలం 91 బంతుల్లో 233 పరుగులు చేసి సంచలనం సృష్టించారు. ఈ ఇన్నింగ్స్‌తో అమృత్‌సర్ జట్టు 533 పరుగులు చేసింది.

అమృత్‌సర్‌లోని గాంధీ గ్రౌండ్‌లో జరిగిన పంజాబ్ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సీనియర్ వన్డే టోర్నమెంట్‌లో అభిషేక్ శర్మ అద్భుతమైన ప్రదర్శన చేశారు. అమృత్‌సర్ మెన్ సీనియర్ తరపున ఆడుతూ, తరణ్ తారన్‌పై కేవలం 91 బంతుల్లో 25 సిక్సర్లు మరియు 15 ఫోర్లతో 233 పరుగులు సాధించి మైదానాన్ని ఊపేసారు. అతని స్ట్రైక్ రేట్ 256.04 గా ఉంది.

అభిషేక్ శర్మ విధ్వంసక ఇన్నింగ్స్‌తో అమృత్‌సర్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 533 పరుగుల భారీ స్కోరు సాధించింది. జింబాబ్వే సిరీస్‌లో ఎదుర్కొన్న ఒడిదుడుకులను అధిగమించి, అభిషేక్ తన ఫామ్‌ను తిరిగి పొంది క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.