కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో సునీల్ నారైన్ అద్భుతమైన బౌలింగ్‌తో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ ప్యాట్రియట్స్ జట్టును దెబ్బతీశారు. ఆయన 24 బంతుల్లో 21 బంతులకు ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 3 వికెట్లు పడగొట్టారు.

సిపిఎల్ (CPL) మ్యాచ్‌లో ట్రినాబాగో నైట్ రైడర్స్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ ప్యాట్రియట్స్‌ను డిఎల్ఎస్ (DLS) పద్ధతిలో 19 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయానికి ప్రధాన కారణం లెజెండరీ స్పిన్నర్ సునీల్ నారైన్. నారైన్ తన 4 ఓవర్ల స్పెల్‌లో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి, 3 కీలక వికెట్లు తీశారు. విశేషమేమిటంటే, ఆయన వేసిన 24 బంతుల్లో 21 బంతులకు ఒక్క పరుగు కూడా రాలేదు.

నారైన్ వేసిన మాయా స్పిన్‌కు బ్యాటర్లు పూర్తిగా తలవంచాల్సి వచ్చింది. పవర్ ప్లే ముగిసే సమయానికి ప్యాట్రియట్స్ జట్టు 3 వికెట్ల నష్టానికి కేవలం 24 పరుగులకే కుదేలైపోయింది. ఈ అద్భుత ప్రదర్శనకు గాను నారైన్‌ను 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా ప్రకటించారు.