ఇంగ్లాండ్ దేశవాళీ వన్డే కప్‌లో హాంప్‌షైర్ బ్యాట్స్‌మెన్ టోబీ ఆల్బర్ట్ అద్భుత ప్రదర్శన చేశాడు. వరుసగా 6 బంతుల్లో 6 సిక్సర్లు బాది సరికొత్త రికార్డు సృష్టించాడు. అతని మెరుపు ఇన్నింగ్స్ సాయంతో హాంప్‌షైర్ జట్టు ససెక్స్‌పై ఘన విజయం సాధించింది.

ఇంగ్లాండ్ వన్డే కప్‌లో భాగంగా హాంప్‌షైర్, ససెక్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టోబీ ఆల్బర్ట్ అనే బ్యాట్స్‌మెన్ సిక్సర్ల వర్షం కురిపించాడు. ఒకే ఓవర్‌లో కాకుండా, రెండు వేర్వేరు ఓవర్లలో తను ఎదుర్కొన్న వరుసగా 6 బంతుల్లో 6 సిక్సర్లు బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. నాంటెస్ ఓస్ట్‌హుయిజెన్ వేసిన ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఆ తర్వాత ఓలీ కర్ట్లీ వేసిన తర్వాతి ఓవర్‌లో మరో నాలుగు సిక్సర్లు బాదాడు.

ఈ మ్యాచ్‌లో ఆల్బర్ట్ కేవలం 37 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 86 పరుగులు చేశాడు. దీంతో హాంప్‌షైర్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 383 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ససెక్స్ జట్టులో చార్లీ టియర్ (111) సెంచరీతో పోరాడినప్పటికీ, ఆ జట్టు 51 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ విజయంతో హాంప్‌షైర్ నాకౌట్ దశకు చేరువైంది.