హార్ముజ్ జలసంధిపై అమెరికా నౌకాదళానికి పూర్తి నియంత్రణ ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ డిమాండ్ చేసిన యుద్ధ నష్టపరిహారాన్ని తిరస్కరించిన ట్రంప్, గత 50 ఏళ్లలో జరిగిన నష్టానికి ఇరాన్ నుండి పరిహారం కోరాలని అమెరికా రాయబారులను ఆదేశించారు.

ఓవల్ ఆఫీస్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్, హార్ముజ్ జలసంధిపై అమెరికా నౌకాదళానికి వంద శాతం నియంత్రణ ఉందని స్పష్టం చేశారు. ఈ దిగ్బంధనం ఉక్కు గోడలాంటిదని, ఇరాన్‌కు వెళ్లే ఏ నౌకను కూడా హార్ముజ్ లోపలికి అనుమతించడం లేదని ఆయన తెలిపారు. అమెరికా అనుమతించిన నౌకలు మాత్రమే అక్కడ ప్రయాణించగలవని పేర్కొన్నారు.

గత ఐదు నెలల సైనిక ఘర్షణల్లో జరిగిన నష్టానికి ఇరాన్ పరిహారం కోరగా, ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ అణు ఆకాంక్షల వల్లే ఈ ఘర్షణలు ప్రారంభమయ్యాయని, గత 50 ఏళ్లలో ఇరాన్ వల్ల జరిగిన నష్టానికి వారే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇరాన్‌తో జరిగే అన్ని దౌత్య చర్చల్లో ఈ నష్టపరిహార నిబంధనను ఖచ్చితంగా చేర్చాలని తన ప్రతినిధులను ట్రంప్ ఆదేశించారు.