ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో భర్త మరియు అత్తమామల వేధింపులు భరించలేక ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. మరణానికి ముందు ఆమె ఒక వీడియో రికార్డ్ చేసి నిందితులను నిందించింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా తాజ్ గంజ్ ప్రాంతంలో ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. మరణానికి ముందు ఆమె సుమారు ఒకటిన్నర నిమిషాల వీడియోను రికార్డ్ చేసి, తన భర్త మరియు అత్తమామలపై తీవ్రమైన వేధింపుల ఆరోపణలు చేసింది. ఆ వీడియోలో ఆమె తన మరణానికి వారే కారణమని పేర్కొంటూ న్యాయం చేయాలని కోరింది.
పోలీసుల సమాచారం ప్రకారం, ప్రియాంక అనే మహిళ 2021లో అభిపాల్‌ను వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. శనివారం రాత్రి ప్రియాంక గది తలుపులు వేసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా, ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. అయితే సోమవారం ఉదయం ఆమె మరణించింది. ఆమె భర్త, అత్తమామలను పోలీసులు అరెస్ట్ చేశారు.
వివాహం జరిగినప్పటి నుండి కట్నం కోసం ప్రియాంకను నిరంతరం వేధిస్తున్నట్లు ఆమె సోదరుడు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు వీడియో ఆధారాలతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు డీసీపీ సయ్యద్ అలీ అబ్బాస్ తెలిపారు.