సింధు నదీ జల ఒప్పందం విషయంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్‌కు తీవ్ర హెచ్చరికలు చేశారు. పాక్ నీటి ప్రతి చుక్క తమ 'రెడ్ లైన్' అని ఆయన పేర్కొన్నారు.
పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా భారత్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇస్లామాబాద్‌లో జరిగిన 'యాద్గార్-ఎ-ఫతహ్' కార్యక్రమంలో సింధు నదీ జల ఒప్పందంపై భారత్‌కు నేరుగా హెచ్చరికలు విసరారు. పాకిస్థాన్ నీటిలోని ప్రతి చుక్క తమ 'రెడ్ లైన్' అని, భారత్ తన వైఖరి నుండి వెనక్కి తగ్గకపోతే పాక్ నేరుగా సమాధానం ఇస్తుందని ఆయన హెచ్చరించారు.
మే 2025లో జరిగిన 'ఆపరేషన్ సింధూర్' ద్వారా భారత్ పాక్ ఉగ్రవాద స్థావరాలపై డీప్ స్ట్రైక్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్తులో పాక్ సార్వభౌమాధికారానికి సవాలు విసిరితే, మే 2025 కంటే మరింత శక్తివంతంగా సమాధానం ఇస్తామని షెహబాజ్ షరీఫ్ మందలించారు.
అంతేకాకుండా, భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక పాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు. చైనాతో పాక్ స్నేహం హిమాలయాల కంటే ఎత్తుగా ఉంటుందని, సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు.