భారత జట్టులో తనకు మళ్లీ చోటు దక్కకపోవడంపై తాను ప్రశాంతంగానే ఉన్నానని టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తెలిపాడు. ఈ కఠిన పరిస్థితుల్లో తన కుటుంబం తనకు ఎంతగానో అండగా నిలిచిందని పేర్కొన్నాడు.
భారత ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తాను ఇకపై జాతీయ జట్టులో భాగం కాదనే వాస్తవాన్ని అంగీకరించానని, దీనికి తన కుటుంబమే కారణమని తెలిపాడు. 36 ఏళ్ల భువనేశ్వర్ చివరిసారిగా 2022లో భారత్ తరఫున ఆడాడు. ఇంట్లో క్రికెట్ గురించి ఎలాంటి చర్చలు జరగకపోవడమే తాను ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా ఉండటానికి సహాయపడిందని ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించాడు.
ప్రస్తుతుం తాను కేవలం ఆటపై ఉన్న ప్రేమతోనే ఐపీఎల్, దేశవాళీ క్రికెట్ ఆడుతున్నట్లు భువనేశ్వర్ తెలిపాడు. భారత క్రికెట్‌లో పేస్ బౌలింగ్ విప్లవానికి విరాట్ కోహ్లీ, రవిశాస్త్రిల దూరదృష్టి కారణమని కొనియాడాడు. సీనియర్ పేసర్ ప్రవీణ్ కుమార్ బౌలింగ్‌ను గమనిస్తూ తాను ఎంతో నేర్చుకున్నానని చెప్పాడు. ఐపీఎల్ 2026లో భువనేశ్వర్ కుమార్ 16 మ్యాచ్‌ల్లో 28 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు.